Search

Tuesday, July 09, 2013

'తాజా' ఛారిటీ సంగీత విభావరి


Telugu Association of Jacksonville Area (TAJA) ఆధ్వర్యంలో ఈ నెల 14న (ఆదివారం) ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ నేతృత్వంలో సంగీత విభావరి జరుగనుంది. ప్రఖ్యాత యువ గాయనీ గాయకులు హేమచంద్ర, కారుణ్య, శ్రీకృష్ణ, శ్రావణ భార్గవి, ప్రణవి, సాయి శిల్ప, సుధామయిలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆహుతులకు తమ గానామృతాన్ని పంచబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వీనులవిందుగా సాగే ఈ కార్యక్రమానికి Lazzara Performance Hall, University of North Florida, I UNF Drive, Bldg 45, Jacksonville Fl 32224-7699 వేదిక కానుంది. మరిన్ని వివరాలకు www.taja.us వెబ్‌సైట్‌ను సందర్శించగలరు లేదా info@taja.usను సంప్రదించగలరు.

జూలై 14న కీరవాణి సంగీత విభావరి

డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (డిటిఎ), నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (ఎన్‌ఎటిఎస్)లు సంయుక్తంగా ఈ నెల 14న (ఆదివారం) కీరవాణి సంగీత విభావరిని ఏర్పాటు చేస్తున్నాయి.

మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సాగే ఈ కార్యక్రమానికి వేదిక Novi High School, 24062 Taft Road, Novi, Mi 48375. ఈ విభావరిలో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు మరియు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలనుకునే వారు మరిన్ని వివరాలకు ఈ క్రింద పేర్కొన్న 2013 డిటిఎ కార్యనిర్వాహక కమిటీని సంప్రదించగలరు.

రఘు రావిపాటి ... 248-787-5624
రమేష్ పెద్దేటి ... 248-613-5751
ప్రవీణ్ జెట్టిపల్లె ... 248-330-1310
వెంకట్ అడపా ... 248-910-8111

Friday, February 08, 2013

TAS ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు


సెయింట్ లూయిస్ తెలుగు సంఘం (Telugu Association of Saint Louis) ఆధ్వర్యంలో ఈ నెల 9న (శనివారం) సంక్రాంతి సంబరాలు జరుగనున్నాయి. ఈ వేడుకలలో భాగంగా నృత్య సంగీత కార్యక్రమాలతో పాటు తెలుగు సంస్కృతికి దర్పం పట్టే పలు కార్యక్రమాలు చోటు చేసుకుంటాయి. ఈ వేడుకలకు విచ్చేయు వారందరికీ సెయింట్ లూయిస్ తెలుగు సంఘం ఆహ్వానం పలుకుతుంది. ఈ వేడుకలకు వేదిక : Kirkwood High School, 801 W. Essex Ave., Kirkwood MO 63122. సెయింట్ లూయిస్ తెలుగు సంఘంలోని సభ్యులు తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోడానికి లేదా నూతనంగా సభ్యత్వం పొందగోరువారికి ఇది మంచి సమయం. మరిన్ని వివరాలకు http://www.stltelugu.org/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు లేదా stltelugu@gmail.com సంప్రదించగలరు.

Tuesday, February 05, 2013

9న యుటా 'అన్నదానం'



'ప్రాజెక్ట్ అన్నపూర్ణ'లో భాగంగా ఈ నెల 9న (శనివారం) అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు యుటా తెలుగు సమితి (Telugu Association of Utah) ఒక ప్రకటనలో తెలిపింది. కులాలకతీతంగా సాగే ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 2 నుంచి 3 గంటలపాటు స్వచ్ఛంద సేవనందించుటకై కార్యకర్తలు ముందుకు రావాల్సిందిగా సంస్థ విజ్ఞప్తి చేసింది. మరిన్ని వివరాలకు http://www.taofu.org/ దర్శించండి.

Date: 02/09/2013 - Saturday
Time: 1PM - 4PM
Where: Kalyani & Balaji Pinjala's house

Sponsors: Kalyani & Balaji Pinjala

Friday, December 28, 2012

టాకో ఆధ్వర్యంలో ముగ్గులు, పతంగుల పోటీలు





తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఒహాయొ (టాకో) తమ సభ్యుల కోసం ముగ్గుల పోటీలు, పతంగుల పోటీలు నిర్వహిస్తోంది. జనవరి 5, 2013 నాడు సాయంత్రం 05.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ పోటీలకు భారతీయ హిందూ టెంపుల్, పోవెల్, ఒహాయో వేదిక కానుంది. ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలనుకునే ఔత్సాహికులకు టాకో స్వాగతం పలుకుతోంది. ఈ పోటీలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ క్రింద పేర్కొన్న వెబ్‌సైట్లను సందర్శించండి.
http://tacosite.com/images/2013_Muggulu_Poti_Rules.jpg
http://tacosite.com/images/2013_KITES_Competition_Rules.jpg

Friday, June 01, 2012

జూన్ 3న 'బాటా' వార్షిక వేసవి పిక్నిక్

Bay Area Telugu Association ఆధ్వర్యంలో జూన్ 3 ఆదివారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు వార్షిక వేసవి పిక్నిక్ (Annual Summer Picnic) జరుగనుంది. Lake Elizabeth Central Park (Lot B), Fremont, CAలో జరుగబోయే ఈ కార్యక్రమానికి ప్రవేశం 'బాటా' సభ్యులకు ఉచితం. మరిన్ని వివరాలకు సంస్థ అధికారిక వెబ్‌సైట్ www.bata.orgను సందర్శించగలరు.

డాలస్‌లో ఘనంగా ఎన్టీఆర్ జయంత్యుత్సవం


డాలస్, మే 31: విశ్వవిఖ్యాత నట సార్వభౌముని చిత్ర ప్రతిమకు ప్రవాస తెలుగు సమాజం వినమ్రంతో ప్రణమిల్లింది. దివంగత నందమూరి తారక రామారావుకి అభినందన హరిచందనాలతో హృదయ పూర్వక వందనమాచరించింది.

డాలస్ అభిమానులు నిర్వహించిన ఎన్టీఆర్ 90వ జయంతి వేడుకల్లో ఆద్యంతం ఆనందాశ్రు సమ్మిళిత ఆనందోత్సాహాలు మిన్నంటాయి. టెక్సస్‌లోని జూబ్లీహాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ నవనీత కృష్ణ గొర్రెపాటి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సుమారు 400 మంది ఆహూతులు సుదూర తీరాల నుంచి సైతం తరలివచ్చారు.

కార్యక్రమంలో ముందుగా ముఖ్య అతిథి నవనీత కృష్ణ ఎన్టీఆర్ చిత్రపటం వద్ద దీప ప్రజ్వలనం చేశారు. పుష్పమాలికలను నివేదించి వందనం చేశారు. ఆ తరువాత చిన్నారులతో సహా ప్రేక్షకులంతా క్యాండిల్స్ వెలిగించి, పుష్పాలు వెదజల్లి మహానేతకు స్మత్యంజలి ఘటించారు. ఈ సందర్భంగా అభిమానులు 'జోహార్ ఎన్టీఆర్', 'అమర్‌రహే ఎన్టీఆర్' వంటి నినాదాలు సభాస్థలిలో మారుమ్రోగాయి.

నందమూరి నట వారసుడు బాలకృష్ణ స్వదేశం నుంచి ఫోన్ ద్వారా మాట్లాడుతూ ప్రవాసాంధ్ర అభిమానులు నిర్వహిస్తున్న కార్యక్రమం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను, సందేశాలను ప్రజల చెంతకు చేర్చడంలో ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని బాలయ్య అభిప్రాయపడ్డారు. అలాగే తెలుగుదేశం పార్టీ నేత ఎర్రంనాయుడు కూడా ఫోన్‌లో మాట్లాడారు. సామాన్య ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించిన మహోన్నత వ్యక్తిగా ఆయన ఎన్టీఆర్‌ను అభివర్ణించారు.

ముఖ్య అతిథి డాక్టర్ నవనీత తన దృక్కోణంలో ఎన్టీఆర్ గురించి వివరించారు. తెలుగు భాష, ప్రజలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. అలాగే శ్రీనివాస్ రావెల్ల కవితాత్మకంగా మాట్లాడారు. పేద ప్రజల కోసం ఎన్టీఆర్ తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఆ తరువాత అనంత్ మల్లవరపు ఎన్టీఆర్ సినీ జీవితాన్ని విశ్లేషించారు. ఎన్టీఆర్ నటించిన 100 చిత్రాలు భారతీయ చిత్రసీమ చరిత్రలో ప్రత్యేకంగా పేర్కొనదగినవని అన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని ఉదహరించారు. ఇంకా రాజేష్ వీరపనేని, భారత్ నుంచి విచ్చేసిన రావ్ లింగ, సురేష్ కాజ, గోపి రెడ్డి చిల్లకూరు, హర్షిత్ వనమ్, జ్యోతి వనమ్ తదితరులు ఎన్టీఆర్ స్మృతులను నెమరు వేసుకున్నారు. ఎన్టీఆర్ పట్ల అభిమానాన్ని చాటారు.

ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని పలువురు అభిమాన కళాకారులు ఆయన నటించిన చిత్రాలలోని పాటలు పాడి, సంభాషణలు ఉచ్ఛరించి ఆహూతులను అలరించారు. సాంబ కమటి, జయ కళ్యాణి, సురేష్ పతనేని శ్రావ్యమైన గానంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి వెంకట్ కొల్లి, చలపాతి రావు కొండ్రుగుంట, శేషారావు బొడ్డు, శ్రీనివాస రావెల్ల, కృష్ణ కొరడ, కృష్ణ మోహన్ అతోట, సురేష్ మండువ, శ్రీధర్ కోడెల, సతీష్ మండువ, శ్రీధర్ తుమ్మల, సాంబ దొడ్డ, శ్రీనివాస్ కావూరి, శ్రీనివాస్ భవిరెడ్డి, శ్రీకాంత్ పోలవరపు, జ్యోతి వనమ్, అనంత్ మల్లవరపు, వినోద్ ఉప్పు, సుగుణ్ చాగర్లమూడి, శ్రీనివాస్ కోనేరు, సాయి లింగ, రామ్ తాతినేని తదితరులు ఈ కార్యక్రమ కర్తృత్వానికి తోడ్పాటునందించారు. 

(మూలం: ఆంధ్రజ్యోతి)

వేమన కవితా కుసుమాల సౌరభాలతో 'నెల నెలా తెలుగు వెన్నెల'


డాలస్, మే 30: పిండారబోసిన వెన్నెల్లో సాహితీ మూర్తులు కవితా పానం చేశారు. వేమన పద్య పారిజాత కుసుమాల సౌరభాన్ని ఆఘ్రాణించి పరవశం చెందారు. డాలస్‌లో ఇటీవల జరిగిన 58వ 'నెల నెలా తెలుగు వెన్నెల' సమావేశంలో సాహితీ రస ఝరి కాలవ కట్టింది. గుండె తడి పెట్టించింది! ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (ట్యాంటెక్స్) సాహిత్య వేదిక సమన్వయకర్త జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమానికి కర్తృత్వం వహించారు. డాలస్ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి పెక్కు సంఖ్యలో భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముందుగా స్వీయ రచన పరిచయ కార్యక్రమంలో భాగంగా పద్య కవులైన డాక్టర్ గన్నవరపు నరసింహ మూర్తి తాను ఇటీవల పూర్తిచేసిన సమస్యా పూరణలను సభికులకు వినిపించారు. "కథలు మనకు ఎందుకు నచ్చుతాయి''అనే విషయం మీద కన్నెగంటి చంద్ర చేసిన ప్రసంగం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవల మరణించిన ప్రముఖ ప్రజాకవి, ప్రజా ఉద్యమ నాయకుడు శివసాగర్ గురించి సాజీ గోపాల్ మాట్లాడారు. శివసాగర్ తనచుట్టూ ఉన్న సమాజంలోని అసమానతలను అధ్యయనం చేసి దానికి పరిష్కార మార్గపు దిశగా ప్రజా ఉద్యమాలను నడిపించారని వివరించారు.

అనంతరం సాహిత్య వేదిక సభ్యుడు మద్దుకూరి విజయ చంద్రహాస్ వెండితెర వేదిక కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన శ్రీమతి సుధామయి గారిని సభాసదులకు పరిచయం చేశారు. 'వ్యాఖ్యాన శిరోమణి', 'ఉత్తమ వ్యాఖ్యాత' తదితర బిరుదులు గల సుధామయి తమ ప్రతిభతో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలలో శ్రోతలను మెప్పించిన విషయం తెలియపరిచారు. విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన సినీజీవిత విశేషాలను వీడియో ద్వారా సుధామయి వివరించి అభిమాన ఆహూతులను అలరించారు.

తదుపరి ట్యాంటెక్స్ కార్యదర్శి, సాహిత్య వేదిక సభ్యుడు డాక్టర్ ఉరిమిండి నరసింహా రెడ్డి ముఖ్య అతిథి శ్రీమతి గంగరాజు రమ గారిని సభకు పరిచయం చేశారు. ఆమె పద్మావతీ డిగ్రీ కళాశాలలో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా అధ్యాపకురాలిగా సేవలందించారు. "వేమన కవితా దృక్పథం మరియు మానవతా వాదం''అనే అంశంపై ముఖ్య అతిథి ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగానూ, ఆలోచనత్మాకంగానూ సాగింది. వేమన యోగిగా మారటం వెనుక ప్రాచుర్యంలో ఉన్న కథలను ఆమె సభాసదులకు వివరించారు.

ఆనాడు సమాజంలో ఉన్న మూఢవిశ్వాసాల మీద అసమానతల మీద తన ఆటవెలది బాణాలను సూటిగా సంధించిన ప్రజాకవి వేమన అని ఆమె అభివర్ణించారు. లోభత్వము, మానవతా వాదము, మూఢ విశ్వాసాలు, కులమతాల లాంటి అనేక అంశాలపై అలతి పదాలతో అద్భుతమైన నీతి పద్యాలను రాసిన వేమన సూర్యచంద్రులున్నంత వరకూ వెలుగులు చిమ్మే అసలు సిసలు కవి అని పేర్కొన్నారు.

అనంతరం శ్రీమతి సుధామయి, రంగరాజు రమ గారిని ట్యాంటెక్స్ అధ్యక్షుడు శ్రీమతి గీత దమ్మన్న, పాలక మండలి అధ్యక్షులు డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి కలిసి దుశ్శాలువాతో సత్కరించారు. ట్యాంటెక్స్ ఉత్తరాధ్యక్షుడు మండువ సురేష్, శ్రీమతి సుధామయి గారికి జ్ఞాపికను సమర్పించారు. సాహిత్య వేదిక సభ్యులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, మద్దుకూరి విజయ చంద్రహాస్, మల్లవరపు అనంత్, డాక్టర్ జువ్వాడి రమణ, డాక్టర్ ఊరిమిండి నరసింహా రెడ్డి, కాజ సురేష్, బిల్లా ప్రవీణ్, నసీం షేక్‌లు ముఖ్య అతిథి శ్రీమతి గంగరాజు రమ గారికి జ్ఞాపిక సమర్పించడంతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి ట్యాంటెక్స్ కార్య నిర్వాహక సభ్యులు వనం జ్యోతి, వీర్నపు చినసత్యం మరియు చామకూర బాల్కి హాజరయ్యారు.

(మూలం: ఆంధ్రజ్యోతి)

Thursday, May 31, 2012

జూన్ 2న ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలు



'గానగంధర్వుడు', పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం 66వ జన్మదిన వేడుకలు జూన్ 2 శనివారం సాయంత్రం 4 గంటలకు జరుగనున్నాయి. Bay Area Telugu Association (BATA) మరియు ChimataMusic.comలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు మిల్పిటాస్‌లోని జైన్ టెంపుల్ ఆడిటోరియం వేదిక కానుంది. ఈ సందర్భంగా జరుగబోయే సంగీత విభావరిలో "జూనియర్ బాలు"గా ప్రసిద్ధిపొందిన ప్రముఖ గాయకుడు రాము (చెన్నై)తో పాటు శారద, సుధ, యామిని, ప్రసాద్ దుర్వాసుల, నారాయణన్, సుబ్రహ్మణ్యం, కృష్ణ రాయసం, మూర్తి గంటి, బాబు మొవ్వ, ప్రసాద్ మంగిన, రామకృష్ణ, శ్రీనివాస్, ప్రత్యూష, ప్రశాంతి, శైలజ, సరిత, మానస తదితర గాయనీగాయకులు గానగంధర్వుడి గళం నుంచి జాలువారిన సుమధురమైన గీతాలను ఆలపించి  ఆహుతులను అలరించనున్నారు. సకుటుంబ సపరివార ఇరుగుపొరుగు మిత్రబృంద సమేతంగా ఈ వేడుకలకు విచ్చేసి శనివారం సాయంసంధ్యలను తమ సొంతం చేసుకోవాలని నిర్వాహకులు సంగీతాభిమానులను కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.bata.org మరియు www.chimataamusic.com వెబ్‌సైట్‌లను సందర్శించగలరు.

Sunday, May 06, 2012

న్యూజెర్సీలో వైభవంగా శ్రీవారి కల్యాణం



అమెరికాలోని న్యూజెర్సీలో శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) తితిదే ఆధ్వర్యంలో శ్రీవారి కల్యాణం వైభవంగా జరిగింది. తిరుమల నుంచి తీసుకొచ్చిన విగ్రహాలకు తితిదే పండితులు శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. గురువాయురప్ప ఆలయంలో జరిగిన ఈ ఉత్సవానికి తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ కనుమూరి బాపిరాజు హాజరయ్యారు. ప్రవాస భారతీయులతోపాటు పలువులు అమెరికన్లు శ్రీనివాస కల్యాణాన్ని కనులారా వీక్షించారు.

(మూలం: ఈనాడు దినపత్రిక)

మే 6న వాషింగ్టన్‌లో శ్రీనివాస కళ్యాణోత్సవం

వాషింగ్టన్, మే 5 : తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అద్వర్యంలో అమెరికా ప్రముఖ నగరం వాషింగ్టన్ డి.సి లోని శ్రీ వెంకటేశ్వర లోటస్ ఆలయంలో మే 6 , 2012 వ తేది ఆదివారం రోజున శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగనుంది. తితిదే వారి శ్రీనివాస కల్యాణోత్సవం ప్రాజెక్టుల్లో భాగంగా ఈ ఉత్సవాన్ని ఇక్కడి ఫెయిర్ ఫాక్స్ , వర్జీనియా, 12501 - 12519 బ్రాడ్డాక్ రోడ్ ప్రాంగణంలో నిర్వహిస్తామని ఆలయం చైర్మన్ రవి అహారం తెలిపారు.

భక్తి, సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా తితిదే గత కొన్నేళ్ళుగా దేశ, విదేశాల్లో శ్రీనివాస కళ్యాణ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నది. భగవంతుని దివ్య కళ్యాణ మహోత్సవాలను నిర్వహించిన శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతాయని హిందూమత విశ్వాసంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తితిదే చేపట్టింది. వర్జీనియాలో నిర్వహించే ఈ కార్యక్రమం కళ్యాణోత్సవానికి మాత్రమే పరిమితం చేయకుండా తిరుమల ఆలయంలో నిర్వహించే ఉదయాస్తమాన సేవలన్నిటిని ఆరోజున ఇక్కడ నిర్వహిస్తారు. అంటే, మే 6వ తేది ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ మొదలుకుని తోమాల సేవ, అర్చన, కళ్యాణాది కార్యక్రమాలు ఉంటాయి.

ఈ అరుదైన కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా, కెనడా దేశాల్లోని ప్రవాస భారతీయులు, వారి బంధువులు ముందుకు రావాలని రవి అహారం పిలుపునిచ్చారు.

(మూలం: ఆంధ్రజ్యోతి)

సందడిగా చీతా 'తెలంగాణ నైట్'

షికాగో, మే 4: షికాగో తెలంగాణ అసోసియేషన్ (చీతా) ఆధ్వర్యంలో వార్షిక తెలంగాణ సాంస్కృతికోత్సవం ఘనంగా జరిగింది. 'తెలంగాణ నైట్ 2012' పేరుతో స్థానిక లెమాంట్ టెంపుల్ ఆడిటోరియంలో ఇటీవల నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 600 మంది ప్రవాస తెలంగాణవాసులు హాజరయ్యారు. సాయంత్రం 7.45 గంటలకు సంప్రదాయ గణపతి పూజ, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.

పసందైన వంటకాలు, వీనుల విందైన ఆటపాటల మేళవింపుతో నాలుగు గంటల పాటు ఏకదాటిగా సాగిన ఈ సరదా సంబరం ఆద్యంతం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ చిన్నారులు ప్రదర్శించిన పలు నృత్యాలు ప్రేక్షకులను మైమరపించాయి. ఈ ఏడాది వేదికను 'కాకతీయ ద్వారం', 'మైసమ్మ దేవత' గోడచిత్రాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

తెలంగాణ ఉద్యమ నేపథ్యం ప్రధానాంశంగా ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతికోత్సవంలో బోనాల వేడుక మరో అదనపు ఆకర్షణ. అలాగే షికాగో పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు, చిన్నారుల అద్భుత ప్రదర్శనలు అందరినీ అలరించాయి. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి నిర్వాహకులు జ్ఞాపికలు ప్రదానం చేశారు. చివరగా 'చీతా' నిర్వాహక కమిటీ సభ్యుల వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

ఈ కార్యక్రమ నిర్వహణకు అజయ్ బొంపల్లి, కిషన్‌రెడ్డి, కృష్ణ రంగరాజు, ప్రదీప్ దమిడి, ప్రకాష్ జలగం, పూర్ణచందర్ అల్లంనేని, రమేష్ కమ్మల, రవి తోకల, శాంతం బోయినపల్లి, శరత్ కల్వకోట, శరత్ పన్‌రెడ్డి, శ్రీనాథ్ చిన్నల, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ ఓరుగంటి, శ్రీరామ్ ఆలేటి, శ్రీధర్ రాజ్, శ్రీనివాస్ పాల్తేపు, తిరుమల నెల్లుట్ల, వేణు చలగొండ, వెంకట్ జువాది, దిలీప్ బల్గురి, ప్రసాద్ బల్గురి, నితీష్ ఎమ్మిడి, గోపాల్ జనగామ, శీని గక్ని తదితరులు కృషి చేశారు.

(మూలం: ఆంధ్రజ్యోతి)

నేడు కొలరాడో తెలుగు అసోసియేషన్ ఉగాది వేడుకలు

కొలరాడో తెలుగు అసోసియేషన్ నేతృత్వంలో ఈ నెల 5న 'శ్రీ నందన నామ సంవత్సర ఉగాది వేడుకలు' జరుపుతున్నట్లు సంస్థ కార్యనిర్వాహక కమిటీ ఓ ప్రకటనలో తెలియజేసింది. మే 5, శనివారం మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభం కానున్న ఈ వేడుకల ప్రణాళిక వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Programme Schedule:
Date & Time: Saturday, May 5, 2012, 3:00 pm Onwards
Social Hour: 3:00 - 4:00
Cultural Programs: 4:00 pm - 7:30 pm
Dinner: 7:30 pm - 8:30 pm
Telugu Cine & Skits Extravaganza: 8:30 pm - 10:00 pm

Programme Venue:
Merrill Middle School
1551 S. Monroe Street
Denver CO 80210

ఈ కార్యక్రమంలో భాగంగా మే 5, మధ్యాహ్నం 3:00 గంటల నుంచి స్థానిక భారతీయ వైద్యులచే ఉచిత వైద్య శిబిరం నిర్వహింపబడుతుంది.

కొలరాడో తెలుగు అసోసియేషన్ నిర్వహిస్తున్న శ్రీ నందన నామ సంవత్సర ఉగాది వేడుకలకు సకుటుంబ, మిత్రబృంద సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంస్థ కార్యనిర్వాహక కమిటీ కోరుతుంది. యితర వివరాలకు సంస్థ అధికారిక వెబ్‌సైట్ www.coloradotelugu.orgని వీక్షించగలరు. 

Saturday, May 05, 2012

మే 19న ఓటిఎస్ కల్చరల్ నైట్

ఓక్లహామా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 19న 'ఉగాది కల్చరల్ నైట్'ను జరుప తలపెట్టినట్లు సంస్థ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు సంస్థ అధికారిక వెబ్‌సైట్ www.oktelugu.org  సందర్శించగలరు.

Sunday, April 29, 2012

అన్నమాచార్య సంకీర్తనోత్సవం

Hindu Society of Central Florida, Telugu Association of Greater Orlando సంయుక్తంగా మే 5న ఆరవ వార్షిక 'అన్నమాచార్య సంకీర్తనోత్సవం'ను నిర్వహిస్తున్నాయి. శనివారం, మే 5న మధ్యాహ్నం 03.00 గంటలకు ప్రారంభమయ్యే అన్నమాచార్య సంకీర్తనోత్సవానికి Hindu Temple Hall, Casselberry వేదిక కానుంది. Orlando, Tampa, Melbourne, Jacksonville, Tallahassee ప్రాంతాల నుంచి సుమారు అరవై మందికి పైగా కళాకారులు ఈ ఉత్సవంలో భాగస్వాములు కానున్నారు. అన్నమాచార్య సంకీర్తనోత్సవంను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నారు కార్యక్రమ నిర్వాహకులు. మరిన్ని వివరాలకు www.orlandotelugu.org వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

టిఏఎస్‌ఎఫ్ ఉగాది సంబరాలు

Telugu Association of South Florida (TASF) ఆధ్వర్యంలో మే 5న ఉగాది సంబరాలను జరుపుతున్నట్లు సంస్థ నిర్వాహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మే 5, శనివారం మధ్యాహ్నం సమయం 01.00 నుంచి రాత్రి 09.00 వరకు జరుగబోయే ఈ సంబరాలకు Art and Culture Center of Hollywood వేదిక కానుంది. మరిన్ని వివరాలకు సంస్థ అధికారిక వెబ్‌సైట్ www.tasf.net సందర్శించగలరు.

మే 19న 'తాజా' వేడుకలు

Telugu Association of Jacksonville Area (TAJA) 10వ వార్షికోత్సవ వేడుకలతో పాటు నందన నామ సంవత్సర ఉగాది వేడుకలను మే 19న జరుపుకోనున్నట్లు సంస్థ నిర్వాహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మే 19, శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8.30 వరకు జరిగే ఈ వేడుకలకు Atlantic Coast High School వేదిక కానుంది. సకుటుంబ, మిత్రబృంద సమేతంగా ఈ వేడుకలకు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. మరిన్ని వివరాలకు సంస్థ అధికారిక వెబ్‌సైట్ www.taja.us సందర్శించగలరు.

Sunday, April 22, 2012

మినెసోటలో ఉగాది సంబరాలు



మినెసోట, ఏప్రిల్ 11 : ప్రతి సంవత్సరం ఆకాశమే హద్దుగా నిర్వహించే ఉగాది సంబరాలు , ఈసారి అంచనాలను మించి, ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి, ప్రతి ఒక్క తెలుగు హృదయం పులకించేలా చేసారు. పిల్లలు పెద్దలు అందరూ ఆడి- పాడి, తెలుగు నందన నామ సంవత్సరాదిని ఎంతో ఘనంగా జరుపుకొన్నారు.

మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూనే, ఇప్పటి యువతరం ఆలోచనలకు దగ్గరగా కార్యక్రమాలు రూపొందించడం ఈసారి కార్యక్రమాల వివేషం. స్టేజి మొత్తం చీకటి చేసి, రేడియం డ్రెస్ తో చేసిన పాటకు సభలో మంచి స్పందన వచ్చింది. ఇలా కొత్త ఆలోచనలతో పోటి పడుతూ, మన సంప్రదాయాలు గౌరవిస్తూ చేసిన "మా తెలుగు తల్లికి మల్ల్లె పూదండ" నృత్య రూపకానికి, కూడా మంచి స్పందన వచ్చింది. తెలుగు భాష శ్రేయోభిలాషి, వెంకటేశ్వర్లు పోతప్రగడను సందర్భంగా లైఫ్ టైం అచ్చీవ్ మెంటు అవార్డు ఇచ్చి సంస్థ సత్యరించింది. టీమ్ వైస్ ప్రెసిడెంటు సూర్య దుగ్గిరాల అవార్డును అందజేసారు.

కార్యక్రమ ప్రధాన స్పొన్సొర్, అమెరికాలో ప్రధాన జాతీయ తెలుగు సంస్థల్లో ఒకటి అయిన అమెరికన్ తెలుగు అసోసియేషన్- ఆటా . టీమ్ ఉగాది వేడుకలకు, ఆటా జాతీయ నాయకులు, కరుణాకర్ మాధవవారం, కరుణాకర్ ఐస, తదితరులతో పాటు, మిడ్ వెస్ట్ కార్యదర్శి, మహిపతిని టీమ్ తరుపున వెంకట్ కొత్తూరు సాదరంగా ఆహ్వానించి, "I want to be American President" అనే జాతీయ కార్యక్రమాన్ని, మిన్నెసోట వేదికగా ప్రారంభించారు. దీని ద్వారా, అమెరికా తెలుగు పిల్లలు తామే అమెరికన్ ప్రెసిడెంట్ అయితే ఏమేమి చేస్తారో చెప్పి పిట్ట కొంచెం కూత ఘనం అనే అచ్చ తెలుగు సామెతను గుర్తుకు తెచ్చారు.

భగీరధుడు గంగను భూమికి తెచ్చే నృత్య రూపకం ఎంతో మంది ప్రశంసలు అందుకొంది. డిస్కో లైట్లతో, మస్త్ మజా పాటలతో సాగిన డాన్స్ విత్ డి.జె. కార్యక్రమానికి, విశేష స్పందన రావడంతో, తప్పకుండా మరో సారి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం అని టీమ్ కల్చరల్ సెక్రటరీ దుర్గాప్రసాద్ కూనపరెడ్డి ప్రకటించారు. వాగ్దానం చేసారు. ఉగాది 2012 కార్యక్రమాన్ని ఎంతో మంది స్వచ్ఛంద కార్యకర్తల సహాయంతో, శ్రీమతి శైలజ సవనం చక్కగా నిర్వహించారు.

మార్కెటింగ్ విభాగ అధిపతి శ్రీకాంత్ కామొజ్జలను , జనరల్ సెక్రటరీ రాజు దంతులూరిని, ఉప కార్య దర్శి చంద్రశేఖర్ జలసూత్రం ని, సౌండ్ అండ్ లైటింగు విభాగంలో బాబు చిమట, శశి పలని, రామ రాజుని, ఫ్రంట్ డెస్క్ విభాగంలో శ్రీ రమేష్ ఆకుల , అరుణ్ తంగిరాలని, హరి పల్లెంపాటి, లక్ష్మన్, చిత్తంను, ఇంకా ఎందరో వాలంటీరులను సందర్బంగా టీమ్ ప్రెసిడెంట్ సుధీర్ నందమూరి అభినందించారు.
(మూలం: ఆంధ్రజ్యోతి)

ఘనంగా జరిగిన హ్యూస్టన్ 2012 ఉగాది వేడుకలు




హ్యూస్టన్, మార్చి 28 : హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి స్థానిక పీయర్లాండ్ మీనాక్షి దేవస్థానం కల్యాణ మండపంలో ఇటీవల నందన నామ ఉగాది వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ముందుగా కార్యక్రమం మన తెలుగు సంప్రదాయం ప్రకారం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. సంబరాలలో పంచాంగ శ్రవణంతో పాటు, స్థానిక సంగీత నృత్య కళాశాలల నుంచి మాత్రమే కాక హ్యూస్టన్‌లోని నలుమూలల నుండి వచ్చిన పిల్లలు, పెద్దలు చేసిన కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలు, నృత్య రూపకాలు, హాస్య నాటికలు రస హృదయులైన ప్రేక్షకులను ఎంతో అలరించగా, ఏక పాత్రాభినయం, లలిత గీతాలు, చిత్ర గీతాలు ఆహుతులను ఆకట్టుకోగా, తెలుగు చలన చిత్ర నృత్యాలు ఆహ్వానితులను ఉర్రూతలూగించి అందరిని 7 గంటల పాటు ఆనందింపజేశారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడే వస్త్రాలు ధరించిన ప్రేక్షకులతో హాలు కళకళలాడింది. అనంతరం తెలుగు సంప్రదాయ భోజనాలతో వేడుకలు ముగిసాయి.

షడ్రుచుల సమ్మేళనంగా జరిగిన ఉగాది వేడుకలలో నూతన కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ గా శారద ఆకునురి, జనరల్ సెక్రటరీగా శాంత సుసర్ల, కల్చరల్ సెక్రెటరీలుగా కృష్ణకీర్తి, రాఘవ సోలిపురం, కోశాధికారిగా చంద్రనేతి, వెబ్ ఇన్చార్జిగా రాజ్‌పసల, స్పెషల్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్‌గా రమేష్ ఆకారపు తదితరులను సభకు పరిచయం చేశారు.

తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు శారద ఆకునురి మాట్లాడుతూ, మన సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలలో పరిరక్షించాలని, ఇప్పటివరకు నిర్వహిస్తున్న కార్యక్రమాలే కాక ఇంకా ఎన్నో విజ్ఞాన, వినోద భరిత కార్యక్రమాలు మీ ముందుకు తీసుకురావాలని నా ఆకాంక్ష అని తెలిపారు. ప్రతి ఒక్క తెలుగు వారు టీసీఏ లో సభ్యులైతే ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు అని వక్కాణించారు. అందరి సహాయ, సహకారాలతో ఇంకా ముందుకు వెళ్ళాలని విజ్ఞప్తి చేశారు. ఉగాది ఉత్సవాలకు గ్రాండ్ స్పాన్సర్ అయిన 'నాటా' తరపు నుంచి సంస్థ అధ్యక్షలు ఏవిఎన్.రెడ్డి, కన్వీనర్ జితేందర్ రెడ్డి, డాక్టర్ సాంబరెడ్డి (మీడియా చైర్), మనోహర్ మేడి (ప్రాంతీయ ఉపాధ్యక్షులు), ప్రాంతీయ సమన్వయ కర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు.

(మూలం: ఆంధ్రజ్యోతి)