Search

Sunday, April 22, 2012

ఘనంగా జరిగిన హ్యూస్టన్ 2012 ఉగాది వేడుకలు




హ్యూస్టన్, మార్చి 28 : హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి స్థానిక పీయర్లాండ్ మీనాక్షి దేవస్థానం కల్యాణ మండపంలో ఇటీవల నందన నామ ఉగాది వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ముందుగా కార్యక్రమం మన తెలుగు సంప్రదాయం ప్రకారం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. సంబరాలలో పంచాంగ శ్రవణంతో పాటు, స్థానిక సంగీత నృత్య కళాశాలల నుంచి మాత్రమే కాక హ్యూస్టన్‌లోని నలుమూలల నుండి వచ్చిన పిల్లలు, పెద్దలు చేసిన కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలు, నృత్య రూపకాలు, హాస్య నాటికలు రస హృదయులైన ప్రేక్షకులను ఎంతో అలరించగా, ఏక పాత్రాభినయం, లలిత గీతాలు, చిత్ర గీతాలు ఆహుతులను ఆకట్టుకోగా, తెలుగు చలన చిత్ర నృత్యాలు ఆహ్వానితులను ఉర్రూతలూగించి అందరిని 7 గంటల పాటు ఆనందింపజేశారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడే వస్త్రాలు ధరించిన ప్రేక్షకులతో హాలు కళకళలాడింది. అనంతరం తెలుగు సంప్రదాయ భోజనాలతో వేడుకలు ముగిసాయి.

షడ్రుచుల సమ్మేళనంగా జరిగిన ఉగాది వేడుకలలో నూతన కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ గా శారద ఆకునురి, జనరల్ సెక్రటరీగా శాంత సుసర్ల, కల్చరల్ సెక్రెటరీలుగా కృష్ణకీర్తి, రాఘవ సోలిపురం, కోశాధికారిగా చంద్రనేతి, వెబ్ ఇన్చార్జిగా రాజ్‌పసల, స్పెషల్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్‌గా రమేష్ ఆకారపు తదితరులను సభకు పరిచయం చేశారు.

తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు శారద ఆకునురి మాట్లాడుతూ, మన సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలలో పరిరక్షించాలని, ఇప్పటివరకు నిర్వహిస్తున్న కార్యక్రమాలే కాక ఇంకా ఎన్నో విజ్ఞాన, వినోద భరిత కార్యక్రమాలు మీ ముందుకు తీసుకురావాలని నా ఆకాంక్ష అని తెలిపారు. ప్రతి ఒక్క తెలుగు వారు టీసీఏ లో సభ్యులైతే ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు అని వక్కాణించారు. అందరి సహాయ, సహకారాలతో ఇంకా ముందుకు వెళ్ళాలని విజ్ఞప్తి చేశారు. ఉగాది ఉత్సవాలకు గ్రాండ్ స్పాన్సర్ అయిన 'నాటా' తరపు నుంచి సంస్థ అధ్యక్షలు ఏవిఎన్.రెడ్డి, కన్వీనర్ జితేందర్ రెడ్డి, డాక్టర్ సాంబరెడ్డి (మీడియా చైర్), మనోహర్ మేడి (ప్రాంతీయ ఉపాధ్యక్షులు), ప్రాంతీయ సమన్వయ కర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు.

(మూలం: ఆంధ్రజ్యోతి)