Search

Friday, June 01, 2012

వేమన కవితా కుసుమాల సౌరభాలతో 'నెల నెలా తెలుగు వెన్నెల'


డాలస్, మే 30: పిండారబోసిన వెన్నెల్లో సాహితీ మూర్తులు కవితా పానం చేశారు. వేమన పద్య పారిజాత కుసుమాల సౌరభాన్ని ఆఘ్రాణించి పరవశం చెందారు. డాలస్‌లో ఇటీవల జరిగిన 58వ 'నెల నెలా తెలుగు వెన్నెల' సమావేశంలో సాహితీ రస ఝరి కాలవ కట్టింది. గుండె తడి పెట్టించింది! ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (ట్యాంటెక్స్) సాహిత్య వేదిక సమన్వయకర్త జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమానికి కర్తృత్వం వహించారు. డాలస్ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి పెక్కు సంఖ్యలో భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముందుగా స్వీయ రచన పరిచయ కార్యక్రమంలో భాగంగా పద్య కవులైన డాక్టర్ గన్నవరపు నరసింహ మూర్తి తాను ఇటీవల పూర్తిచేసిన సమస్యా పూరణలను సభికులకు వినిపించారు. "కథలు మనకు ఎందుకు నచ్చుతాయి''అనే విషయం మీద కన్నెగంటి చంద్ర చేసిన ప్రసంగం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవల మరణించిన ప్రముఖ ప్రజాకవి, ప్రజా ఉద్యమ నాయకుడు శివసాగర్ గురించి సాజీ గోపాల్ మాట్లాడారు. శివసాగర్ తనచుట్టూ ఉన్న సమాజంలోని అసమానతలను అధ్యయనం చేసి దానికి పరిష్కార మార్గపు దిశగా ప్రజా ఉద్యమాలను నడిపించారని వివరించారు.

అనంతరం సాహిత్య వేదిక సభ్యుడు మద్దుకూరి విజయ చంద్రహాస్ వెండితెర వేదిక కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన శ్రీమతి సుధామయి గారిని సభాసదులకు పరిచయం చేశారు. 'వ్యాఖ్యాన శిరోమణి', 'ఉత్తమ వ్యాఖ్యాత' తదితర బిరుదులు గల సుధామయి తమ ప్రతిభతో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలలో శ్రోతలను మెప్పించిన విషయం తెలియపరిచారు. విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన సినీజీవిత విశేషాలను వీడియో ద్వారా సుధామయి వివరించి అభిమాన ఆహూతులను అలరించారు.

తదుపరి ట్యాంటెక్స్ కార్యదర్శి, సాహిత్య వేదిక సభ్యుడు డాక్టర్ ఉరిమిండి నరసింహా రెడ్డి ముఖ్య అతిథి శ్రీమతి గంగరాజు రమ గారిని సభకు పరిచయం చేశారు. ఆమె పద్మావతీ డిగ్రీ కళాశాలలో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా అధ్యాపకురాలిగా సేవలందించారు. "వేమన కవితా దృక్పథం మరియు మానవతా వాదం''అనే అంశంపై ముఖ్య అతిథి ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగానూ, ఆలోచనత్మాకంగానూ సాగింది. వేమన యోగిగా మారటం వెనుక ప్రాచుర్యంలో ఉన్న కథలను ఆమె సభాసదులకు వివరించారు.

ఆనాడు సమాజంలో ఉన్న మూఢవిశ్వాసాల మీద అసమానతల మీద తన ఆటవెలది బాణాలను సూటిగా సంధించిన ప్రజాకవి వేమన అని ఆమె అభివర్ణించారు. లోభత్వము, మానవతా వాదము, మూఢ విశ్వాసాలు, కులమతాల లాంటి అనేక అంశాలపై అలతి పదాలతో అద్భుతమైన నీతి పద్యాలను రాసిన వేమన సూర్యచంద్రులున్నంత వరకూ వెలుగులు చిమ్మే అసలు సిసలు కవి అని పేర్కొన్నారు.

అనంతరం శ్రీమతి సుధామయి, రంగరాజు రమ గారిని ట్యాంటెక్స్ అధ్యక్షుడు శ్రీమతి గీత దమ్మన్న, పాలక మండలి అధ్యక్షులు డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి కలిసి దుశ్శాలువాతో సత్కరించారు. ట్యాంటెక్స్ ఉత్తరాధ్యక్షుడు మండువ సురేష్, శ్రీమతి సుధామయి గారికి జ్ఞాపికను సమర్పించారు. సాహిత్య వేదిక సభ్యులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, మద్దుకూరి విజయ చంద్రహాస్, మల్లవరపు అనంత్, డాక్టర్ జువ్వాడి రమణ, డాక్టర్ ఊరిమిండి నరసింహా రెడ్డి, కాజ సురేష్, బిల్లా ప్రవీణ్, నసీం షేక్‌లు ముఖ్య అతిథి శ్రీమతి గంగరాజు రమ గారికి జ్ఞాపిక సమర్పించడంతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి ట్యాంటెక్స్ కార్య నిర్వాహక సభ్యులు వనం జ్యోతి, వీర్నపు చినసత్యం మరియు చామకూర బాల్కి హాజరయ్యారు.

(మూలం: ఆంధ్రజ్యోతి)