Search

Friday, June 01, 2012

డాలస్‌లో ఘనంగా ఎన్టీఆర్ జయంత్యుత్సవం


డాలస్, మే 31: విశ్వవిఖ్యాత నట సార్వభౌముని చిత్ర ప్రతిమకు ప్రవాస తెలుగు సమాజం వినమ్రంతో ప్రణమిల్లింది. దివంగత నందమూరి తారక రామారావుకి అభినందన హరిచందనాలతో హృదయ పూర్వక వందనమాచరించింది.

డాలస్ అభిమానులు నిర్వహించిన ఎన్టీఆర్ 90వ జయంతి వేడుకల్లో ఆద్యంతం ఆనందాశ్రు సమ్మిళిత ఆనందోత్సాహాలు మిన్నంటాయి. టెక్సస్‌లోని జూబ్లీహాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ నవనీత కృష్ణ గొర్రెపాటి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సుమారు 400 మంది ఆహూతులు సుదూర తీరాల నుంచి సైతం తరలివచ్చారు.

కార్యక్రమంలో ముందుగా ముఖ్య అతిథి నవనీత కృష్ణ ఎన్టీఆర్ చిత్రపటం వద్ద దీప ప్రజ్వలనం చేశారు. పుష్పమాలికలను నివేదించి వందనం చేశారు. ఆ తరువాత చిన్నారులతో సహా ప్రేక్షకులంతా క్యాండిల్స్ వెలిగించి, పుష్పాలు వెదజల్లి మహానేతకు స్మత్యంజలి ఘటించారు. ఈ సందర్భంగా అభిమానులు 'జోహార్ ఎన్టీఆర్', 'అమర్‌రహే ఎన్టీఆర్' వంటి నినాదాలు సభాస్థలిలో మారుమ్రోగాయి.

నందమూరి నట వారసుడు బాలకృష్ణ స్వదేశం నుంచి ఫోన్ ద్వారా మాట్లాడుతూ ప్రవాసాంధ్ర అభిమానులు నిర్వహిస్తున్న కార్యక్రమం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను, సందేశాలను ప్రజల చెంతకు చేర్చడంలో ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని బాలయ్య అభిప్రాయపడ్డారు. అలాగే తెలుగుదేశం పార్టీ నేత ఎర్రంనాయుడు కూడా ఫోన్‌లో మాట్లాడారు. సామాన్య ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించిన మహోన్నత వ్యక్తిగా ఆయన ఎన్టీఆర్‌ను అభివర్ణించారు.

ముఖ్య అతిథి డాక్టర్ నవనీత తన దృక్కోణంలో ఎన్టీఆర్ గురించి వివరించారు. తెలుగు భాష, ప్రజలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. అలాగే శ్రీనివాస్ రావెల్ల కవితాత్మకంగా మాట్లాడారు. పేద ప్రజల కోసం ఎన్టీఆర్ తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఆ తరువాత అనంత్ మల్లవరపు ఎన్టీఆర్ సినీ జీవితాన్ని విశ్లేషించారు. ఎన్టీఆర్ నటించిన 100 చిత్రాలు భారతీయ చిత్రసీమ చరిత్రలో ప్రత్యేకంగా పేర్కొనదగినవని అన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని ఉదహరించారు. ఇంకా రాజేష్ వీరపనేని, భారత్ నుంచి విచ్చేసిన రావ్ లింగ, సురేష్ కాజ, గోపి రెడ్డి చిల్లకూరు, హర్షిత్ వనమ్, జ్యోతి వనమ్ తదితరులు ఎన్టీఆర్ స్మృతులను నెమరు వేసుకున్నారు. ఎన్టీఆర్ పట్ల అభిమానాన్ని చాటారు.

ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని పలువురు అభిమాన కళాకారులు ఆయన నటించిన చిత్రాలలోని పాటలు పాడి, సంభాషణలు ఉచ్ఛరించి ఆహూతులను అలరించారు. సాంబ కమటి, జయ కళ్యాణి, సురేష్ పతనేని శ్రావ్యమైన గానంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి వెంకట్ కొల్లి, చలపాతి రావు కొండ్రుగుంట, శేషారావు బొడ్డు, శ్రీనివాస రావెల్ల, కృష్ణ కొరడ, కృష్ణ మోహన్ అతోట, సురేష్ మండువ, శ్రీధర్ కోడెల, సతీష్ మండువ, శ్రీధర్ తుమ్మల, సాంబ దొడ్డ, శ్రీనివాస్ కావూరి, శ్రీనివాస్ భవిరెడ్డి, శ్రీకాంత్ పోలవరపు, జ్యోతి వనమ్, అనంత్ మల్లవరపు, వినోద్ ఉప్పు, సుగుణ్ చాగర్లమూడి, శ్రీనివాస్ కోనేరు, సాయి లింగ, రామ్ తాతినేని తదితరులు ఈ కార్యక్రమ కర్తృత్వానికి తోడ్పాటునందించారు. 

(మూలం: ఆంధ్రజ్యోతి)