Search

Sunday, May 06, 2012

సందడిగా చీతా 'తెలంగాణ నైట్'

షికాగో, మే 4: షికాగో తెలంగాణ అసోసియేషన్ (చీతా) ఆధ్వర్యంలో వార్షిక తెలంగాణ సాంస్కృతికోత్సవం ఘనంగా జరిగింది. 'తెలంగాణ నైట్ 2012' పేరుతో స్థానిక లెమాంట్ టెంపుల్ ఆడిటోరియంలో ఇటీవల నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 600 మంది ప్రవాస తెలంగాణవాసులు హాజరయ్యారు. సాయంత్రం 7.45 గంటలకు సంప్రదాయ గణపతి పూజ, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.

పసందైన వంటకాలు, వీనుల విందైన ఆటపాటల మేళవింపుతో నాలుగు గంటల పాటు ఏకదాటిగా సాగిన ఈ సరదా సంబరం ఆద్యంతం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ చిన్నారులు ప్రదర్శించిన పలు నృత్యాలు ప్రేక్షకులను మైమరపించాయి. ఈ ఏడాది వేదికను 'కాకతీయ ద్వారం', 'మైసమ్మ దేవత' గోడచిత్రాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

తెలంగాణ ఉద్యమ నేపథ్యం ప్రధానాంశంగా ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతికోత్సవంలో బోనాల వేడుక మరో అదనపు ఆకర్షణ. అలాగే షికాగో పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు, చిన్నారుల అద్భుత ప్రదర్శనలు అందరినీ అలరించాయి. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి నిర్వాహకులు జ్ఞాపికలు ప్రదానం చేశారు. చివరగా 'చీతా' నిర్వాహక కమిటీ సభ్యుల వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

ఈ కార్యక్రమ నిర్వహణకు అజయ్ బొంపల్లి, కిషన్‌రెడ్డి, కృష్ణ రంగరాజు, ప్రదీప్ దమిడి, ప్రకాష్ జలగం, పూర్ణచందర్ అల్లంనేని, రమేష్ కమ్మల, రవి తోకల, శాంతం బోయినపల్లి, శరత్ కల్వకోట, శరత్ పన్‌రెడ్డి, శ్రీనాథ్ చిన్నల, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ ఓరుగంటి, శ్రీరామ్ ఆలేటి, శ్రీధర్ రాజ్, శ్రీనివాస్ పాల్తేపు, తిరుమల నెల్లుట్ల, వేణు చలగొండ, వెంకట్ జువాది, దిలీప్ బల్గురి, ప్రసాద్ బల్గురి, నితీష్ ఎమ్మిడి, గోపాల్ జనగామ, శీని గక్ని తదితరులు కృషి చేశారు.

(మూలం: ఆంధ్రజ్యోతి)