Search

Sunday, May 06, 2012

మే 6న వాషింగ్టన్‌లో శ్రీనివాస కళ్యాణోత్సవం

వాషింగ్టన్, మే 5 : తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అద్వర్యంలో అమెరికా ప్రముఖ నగరం వాషింగ్టన్ డి.సి లోని శ్రీ వెంకటేశ్వర లోటస్ ఆలయంలో మే 6 , 2012 వ తేది ఆదివారం రోజున శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగనుంది. తితిదే వారి శ్రీనివాస కల్యాణోత్సవం ప్రాజెక్టుల్లో భాగంగా ఈ ఉత్సవాన్ని ఇక్కడి ఫెయిర్ ఫాక్స్ , వర్జీనియా, 12501 - 12519 బ్రాడ్డాక్ రోడ్ ప్రాంగణంలో నిర్వహిస్తామని ఆలయం చైర్మన్ రవి అహారం తెలిపారు.

భక్తి, సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా తితిదే గత కొన్నేళ్ళుగా దేశ, విదేశాల్లో శ్రీనివాస కళ్యాణ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నది. భగవంతుని దివ్య కళ్యాణ మహోత్సవాలను నిర్వహించిన శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతాయని హిందూమత విశ్వాసంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తితిదే చేపట్టింది. వర్జీనియాలో నిర్వహించే ఈ కార్యక్రమం కళ్యాణోత్సవానికి మాత్రమే పరిమితం చేయకుండా తిరుమల ఆలయంలో నిర్వహించే ఉదయాస్తమాన సేవలన్నిటిని ఆరోజున ఇక్కడ నిర్వహిస్తారు. అంటే, మే 6వ తేది ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ మొదలుకుని తోమాల సేవ, అర్చన, కళ్యాణాది కార్యక్రమాలు ఉంటాయి.

ఈ అరుదైన కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా, కెనడా దేశాల్లోని ప్రవాస భారతీయులు, వారి బంధువులు ముందుకు రావాలని రవి అహారం పిలుపునిచ్చారు.

(మూలం: ఆంధ్రజ్యోతి)